365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 10,2025: ఐటీ కారిడార్ మాధాపూర్‌లో మరో ఆకర్షణగా తమ్మిడికుంట సహజ సరస్సుగా మారనుంది. మురుగునీరు, దుర్గంధాన్ని వదిలించుకుని, ముళ్లపొదలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మీటర్ల మేర పూడికను తొలగించి చెరువుకు సహజత్వం అందించింది హైడ్రా.
ఆక్రమణలు, పూడిక తొలగించి విస్తీర్ణం పెంచడంతో పరిసరాలు విశాలంగా మారాయి. శిల్పారామం వైపు ప్రధాన ప్రవేశ మార్గం నయనమనోహరంగా తయారవుతోంది. ఈ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు చుట్టూ పటిష్టమైన బండ్, ఇన్లెట్లు, ఔట్లెట్ల నిర్మాణాలను తనిఖీ చేశారు.
ఐటీ కారిడార్‌లోని ఈ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, శిల్పారామం వద్ద వరదనీరు నిలవకుండా ఇన్లెట్లు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించినట్టు, అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా అభివృద్ధి చేయాలని సూచించారు.

సందర్శకులకు సేద తీరేలా ఏర్పాట్లు..
దేశ నలుమూలల నుంచి వచ్చే ఐటీ నిపుణులు నడయాడే, అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణం కోసం చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన పరిసరాలు అంతే ముఖ్యమన్నారు. చెరువు చుట్టూ 2 కి.మీ. మేర బండ్‌పై ఆక్సిజన్ అందించే చెట్లు, చల్లని నీడ ఇచ్చే వృక్షాలు పెంచాలన్నారు. ప్రధాన ప్రవేశ మార్గంలో పార్కులు అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
అన్ని వయసుల వారికీ సేద తీరేలా ఏర్పాట్లు చేయాలన్నారు:
#పిల్లలకు ఆటవిడుపు క్రీడా స్థలాలు
#వృద్ధులకు సిమెంట్/రాతి కుర్చీలు
#ఓపెన్ జిమ్‌లు
#ప్రశాంతంగా మాట్లాడుకునేందుకు గుమ్మటాలు
అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్, హైడ్రా ఏసీపీ శ్రీకాంత్ సహా పలువురు అధికారులు కమిషనర్ వెంట సందర్శనలో పాల్గొన్నారు.
