365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 28,2022:AVM వారి భక్త ప్రహ్లాద చిత్రం లో మన ఎస్వీఆర్ హిరణ్యకశ్యపునిగా నటించారు. కాదు జీవించారు. సురులు అసురులు అన్నదమ్ములు. తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం వేరు. సవతులకు పడదు. కాబట్టి సవతి బిడ్డలకు పడదు. సురులు విష్ణుమూర్తి శరణు కోరి, అభయం పొందారు.
దానితో సురుల తో పాటు హరి కూడా అసురలకు శత్రువు అయ్యాడు. పక్షపాతం లేని మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు అసురులకు ఆరాధ్యదైవాలు అయ్యారు. ఘోర తపస్సు చేసి, అద్భుత వరాలు పొంది , సురులను ముప్పతిప్పలు పెట్టేవారు.
కంటికి కనిపించకుండా తిరిగే హరి ని చూడాలని హిరణ్యకశ్యపుని కోరిక. ఒక విధంగా దేవుడు ఉన్నాడా ? లేడా ? అని తెలుసుకోవాలనే తత్వ జ్ఞాని . హరి భక్తులను హింసించు, హరి దిగివస్తాడని నారదుడు చెప్పాడు.

దానితో ఒక నిర్ణయానికి వచ్చాడు హిరణ్యకశ్యపుడు. నేనే దేవుడిని అని ప్రకటించాడు. ” నేను ముల్లోకాలను సార్వభౌముడుని. దేవతలను జయించినవాడను. నేను భగవంతుడు అని అని మీరందరూ అంగీకరించవలె.
నిరంతరం నా నామమే జపించవలె , మీరందరు ఒకసారి నా నామము జపించుడు ” అని సభలోని వారిని శాసిస్తాడు. ఆయన శాసించినట్టే అందరు ఓం హిరణ్యాయ నమః అని అంటారు. ఆహా కర్ణపేయంగా ఉంది . ఏది మరొక్కసారి, ఏది ఇంకోసారి అని మూడు సార్లు జై కొట్టించుకుంటాడు.

మహదానంద పడుతాడు. ఆ ఆనందపడే తీరు ఒక ఎస్వీఆర్ గారికి మాత్రమే సాధ్యం. ఆ సన్నివేశం లో వారి నట విశ్వరూపం చూడవలసినదే. మాటలలో వర్ణించడం కష్టం. వారి నటన, హావభావాలు నభూతో న భవిష్యతి. ఈ పాత్రలో మరో నటుడిని ఊహించడం కూడా కష్టం. అందుకే ఎస్వీఆర్ ది గ్రేట్ అనేది. .