365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 1,2025: డిసెంబర్, జనవరి రెండునెలల్లోనే చలి తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీలో 474 మంది తనువుచాలించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అనేక నిరాశ్రయ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు అందుబాటులో లేవని, వాటిలో కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు కఠినమైన చలిలో జీవించాల్సి వస్తోందని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ)ఒక ప్రకటనలో తెలిపింది.

చలికి తట్టుకోలేక నాలుగువందల మందికి పైగా చనిపోవడం చాలా బాధాకరమని తెలిపింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసి, వారంలోపు వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది.

వీధుల్లో నివసించే నిరాశ్రయులకు సరైన వైద్య సంరక్షణ, నిర్వహణ లేకపోవడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, మానసిక ఆరోగ్యం క్షీణించడం వంటి అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.

రైల్వే స్టేషన్‌లో 100మంది మృతి..

శీతాకాలంలో సంభవించిన మరణాలలో ఎక్కువగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే నమోదయ్యాయి. వీటిలో ఆనంద్ విహార్, సబ్జీ మండి, హజ్రత్ నిజాముద్దీన్, సారాయ్ రోహిల్లా, ఢిల్లీ కాంట్ ,ఇతర స్టేషన్లు ఉన్నాయి.. ఈ ప్రాంతాల్లో దాదాపు 100 మందిచనిపోవడం పట్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారాన్ని వ్యక్తం చేసింది.

తదనంతరం, ఉత్తర ఢిల్లీ జిల్లా పోలీసు ప్రాంతంలో మరిన్ని మరణాలు సంభవించాయి. సబ్జీ మండి, కాశ్మీరీ గేట్, కొత్వాలి, లాహోరీ గేట్, సివిల్ లైన్స్, బారా హిందూ రావు, సదర్ బజార్, తిమార్పూర్, సారాయ్ రోహిల్లా, వజీరాబాద్, గులాబీ బాగ్,ఇతర ప్రదేశాలలో నవంబర్ నుంచి 83 మరణాలు సంభవించాయి.

సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్, పహార్‌గంజ్, నబీ కరీం, జామా మసీదు, హౌజ్ ఖాజీ, రాజేంద్ర నగర్, పటేల్ నగర్, కమలా మార్కెట్, కరోల్ బాగ్,ఇతర ప్రాంతాలలో చలి కారణంగా 54 మంది నిరాశ్రయులు మరణించారు.