365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 8,2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన అంతర్ కళాశాల క్రీడలు, లలిత కళలు, సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిసాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆడిటోరియంలో పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమాన్ని విశిష్ట అతిథులుగా రాజేంద్రనగర్ డి.సి.పి, ఆర్. జగదీశ్వర్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భం ఆర్. జగదీశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
వ్యవసాయ రంగం భారత దేశానికి వెన్నెముక వంటిదన్నారు. విశ్వ విద్యాలయ విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో అభివృద్ధి పరచగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

రిజిస్ట్రార్ ఎస్. సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని కళాశాలలో క్రీడలకు సంబంధించిన వసతులు మెరుగుపరుస్తూ, బాలికలకు ప్రత్యేకమైన జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ పోటీలలో వివిధ కళాశాలలకు చెందిన 570 మంది విద్యార్థి, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా హోరాహోరీగా సాగిన బాలుర క్రికెట్ చివరి ఆటలో రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు గెలుపొందగా, జగిత్యాల కళాశాల విద్యార్థులు రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.

లలిత కళలు, సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక పోటీలలో కమ్యూనిటీ సైన్స్ కళాశాల, సైఫాబాద్ విద్యార్థిని విద్యార్థులు మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బాలికల విభాగంలో ఛాంపియన్ షిప్ ను వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట దక్కించుకోగా, బాలుర విభాగంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కైవసం చేసుకుంది. రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థి, విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ వి.అనిత, డాక్టర్ జె. సత్యనారాయణ, డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ జమునా రాణి, కళాశాల అసోసియేట్ డీన్ సి. నరేంద్ర రెడ్డి, యూనివర్సిటీ అబ్జార్వర్ డాక్టర్ బి. విద్యాసాగర్, డాక్టర్ వి. రవీందర్ నాయక్, యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది వివిధ కళాశాలల ఓఐఎస్ ఏలు,OISAలు, పీడీలు పాల్గొన్నారు.