365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 21,2023: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సెషన్లోనూ నష్టపోయాయి. బెంచ్‌మార్క్ సూచీలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం భారీ పతనం చవిచూశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

హాంకాంగ్ మినహాయిస్తే మిగిలిన ఆసియా సూచీలన్నీ ఎరుపెక్కాయి. బుధవారం అమెరికా టెక్ కంపెనీల షేర్లు పతనమవ్వడంతో గురువారం అంతటా అదే పరిస్థితి కొనసాగింది. సుదీర్ఘ కాలం వడ్డీరేట్లు అత్యధిక స్థాయిలోనే కొనసాగుతాయని యూఎస్ ఫెడ్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది.
దాంతో ఇన్వెస్టర్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. స్విస్ బ్యాంక్ ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో స్విస్ ఫ్రాంక్ పతనమైంది.
క్రితం సెషన్లో 66,800 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 66,608 వద్ద మొదలైంది. ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకుంది. 66,128 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 570 పాయింట్ల నష్టంతో 66,230 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌కు ఆరంభ స్థాయే గరిష్ఠం కావడం గమనార్హం. గురువారం 19,840 వద్ద మొదలైన నిఫ్టీ 19,848 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 19,709 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ మొత్తంగా 159 పాయింట్లు పతనమై 19,742 వద్ద క్లోజైంది.

బ్యాంకు నిఫ్టీ ఏకంగా 760 పాయింట్లు నష్టపోయి 44,623 వద్ద ముగిసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.09 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభపడగా 34 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, ఎస్బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంకు షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఏకంగా 2.28 శాతం నష్టపోయింది. ఆటో, బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, ఫార్మా రంగాల సూచీలు ఒకశాతానికి పైగానే ఎరుపెక్కాయి. ఎనర్జీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

నిఫ్టీ పతనంలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, ఎస్బీఐ, కొటక్ బ్యాంకు వెయిటేజీనే ఎక్కువ.
నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్ టెక్నికల్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,850 వద్ద రెసిస్టెన్సీ, 19,700 వద్ద సపోర్ట్ ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రో, ఇన్ఫీ, బీపీసీఎల్, యూపీఎల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లను ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి కొనుగోలు చేయొచ్చు.
కెనడా అసోసియేట్ కంపెనీ వైండప్ కావడంతో ఎం అండ్ ఎం షేర్లు 3 శాతం నష్టపోయాయి. నిఫ్టీ 500లో డెల్టాకార్ప్, వేదాంత షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిలకు వచ్చాయి. ఫాలింగ్ మార్కెట్లోనూ చోలమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్, గ్లెన్ మార్క్స్, ఇండియన్ బ్యాంక్, కేఎస్‌బీ, ఫీనిక్స్ మిల్స్ పాలీక్యాబ్ ఇండియా, వెల్‌స్పన్ కార్ప్ 52 వారాల గరిష్ఠ స్థాయి అందుకోవడం గమనార్హం.
నేడు అదానీ గ్రూప్‌లో చాలా కంపెనీలు లాభపడ్డాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు కొంత పెరిగాయి. బీఎస్‌ఈ నమోది కంపెనీల మార్కెట్ విలువ గురువారం రూ.2.5 లక్షల కోట్ల మేర తగ్గింది.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709