Mon. Nov 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 6,2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా రెండో సెషన్లో అదరగొట్టాయి.

క్రూడాయిల్‌ ధరలు తగ్గుతుండటం మార్కెట్‌ వర్గాల్లో పాజిటివ్‌ సెంటిమెంటుకు కారణమైంది. ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీరేట్ల యథాతథంగా ఉంచింది. ఊహించిందే జరగడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు చేపట్టారు.

ఆసియాలో జపాన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, కొరియా, చైనా సూచీలు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 107, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 364 పాయింట్ల మేర పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.25 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 65,631 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,867 వద్ద మొదలైంది. 65,762 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 364 పాయింట్లు పెరిగి 65,995 వద్ద ముగిసింది.

గురువారం 19,545 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,621 వద్ద ఓపెనైంది. 19,589 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,675 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 107 పాయింట్లు పెరిగి 19,653 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 147 పాయింట్ల లాభంతో 44,360 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (5.60%), బజాజ్‌ ఫైనాన్స్‌ (3.81%), టైటాన్‌ (2.76%), ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (2.23%), టాటా కన్జూమర్‌ (1.66%) టాప్‌ గెయినర్స్‌.

హిందుస్థాన్‌ యునీలివర్‌ (0.79%), కోల్‌ ఇండియా (0.64%), ఓఎన్జీసీ (0.38%), ఏసియన్‌ పెయింట్స్‌ (0.29%), భారతీ ఎయిర్‌టెల్‌ (0.25%) టాప్‌ లాసర్స్‌. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాల సూచీలు ఎక్కువగా లాభపడ్డాయి.

నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,750 వద్ద రెసిస్టెన్సీ, 19,630 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో ఇన్ఫోసిస్‌, ఐటీసీ, యూపీఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, ట్రెంట్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

నిఫ్టీ పెరుగుదలలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫీ, ఐటీసీ, బజాజ్‌, ఐటీసీ కీలకంగా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్‌ 20 పాయింట్ల వరకు కంట్రిబ్యూట్‌ చేసింది.

క్యూఐపీ మార్గంలో రూ.10,000 కోట్లను సేకరించేందుకు బోర్డు ఆమోదం తెలపడంతో బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. పదేళ్ల బాండ్ విలువ ఈ ఆరు నెలల్లోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బిజినెస్‌ అప్‌డేట్‌ రావడంతో కల్యాణ్‌ జువెలర్స్‌ షేర్లు ఆరు శాతం మేర పెరిగాయి.

ఇంట్రాడేలో అదానీ గ్రూప్‌ షేర్లు మదుపర్లకు రూ.14,000 సంపదను సమకూర్చాయి. మిడ్‌క్యాప్‌ స్థాయిలో దాల్మియా భారత్‌, గ్లెన్‌మార్క్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, వొడాఫోన్‌ ఐడియా టాప్‌ లాసర్స్‌గా ఉన్నాయి. టీసీఎస్‌ 52 వారాల గరిష్ఠానికి చేరడం, ఇన్ఫీ పెరగడంతో ఐటీ షేర్లలో జోష్‌ కనిపించింది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!