Sat. Nov 23rd, 2024
This is the reason for lifting the lock down
This is the reason for lifting the lock down

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జూన్ 19, 2021: లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్ధారించింది.

This is the reason for lifting the lock down
This is the reason for lifting the lock down

ఈ మేరకు జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం తదితర కరోనా స్వీయ నియంత్రణ నియమావళిని విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

error: Content is protected !!