365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జూన్ 28,2023: దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో మాదిరిగానే గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనూ టమోటాధర భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం టమోటా కిలో ధర 100 రూపాయలకు చేరుకుంది.

మార్కెట్లలో కొనే వారు,ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే వారు టమాటా ధర భారీగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. దాదాపు అన్ని వంటలలో ఉపయోగించే అత్యంత సాధారణ కూరగాయలలో ఒకటి టమాటా, టొమాటో ధర పెరుగుతున్నందున సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు.

మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు 23 కిలోల టమాటా ఉన్న పెట్టె రూ.1,600 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు.

అదే విధంగా చిన్న సైజు టొమాటోలు ఉన్న పెట్టె రూ.1,200కు లభిస్తోంది. మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.60 నుంచి 80 వరకు పెరగగా, కొన్నిచోట్ల నాణ్యతను బట్టి రూ.100కు కూడా చేరింది.

మార్కెట్‌లో టమాటా ధర భారీగా ఎందుకు పెరుగుతోందంటే..? ఇటీవలి ధరల పెరుగుదలకు రుతుపవనాలు ఆలస్యం కావడమేకాకుండా, విపరీతమైన ఉష్ణోగ్రతలు కూడా వీటి ధర పెరగడానికి కారణమని విక్రయదారులు చెబుతున్నారు.

వాతావరణ పరిస్థితులు తెలంగాణలో టమోటా సాగుపై ప్రభావం చూపాయని, దీంతో సరఫరా తగ్గిపోయిందని రైతులు పేర్కొన్నారు. వేసవిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు.

గత 15 నుంచి 20 రోజులుగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో టమాట కిలో రూ.35-45 వరకు విక్రయించేవారు. నాటు, హైబ్రిడ్ రకాలు రెండూ ఇటీవలి వారాల్లో ధరలు బాగాపెరిగాయని వారు చెబుతున్నారు.

అయితే రుతుపవనాల రాక కొంత ఉపశమనం కలిగించవచ్చని కొంతమంది విక్రేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,ఉత్తరప్రదేశ్ నుంచి టమోటాలు దిగుమతి అవుతాయి.