365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24, 2023: భారత స్టాక్ మార్కెట్లు గతవారం కలవరపెట్టాయి. అంతర్జాతీయ పరిణామాలతో బెంచ్‌మార్క్ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకోవడం, యూఎస్ ఫెడ్ అత్యధిక వడ్డీరేట్లనే సుదీర్ఘ కాలం కొనసాగిస్తామని సంకేతాలు ఇవ్వడం, యూఎస్ బాండ్ ఈల్డులు పెరగడం వంటివి ఇందుకు కారణాలు.

వీటికి తోడుగా విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాలను స్వీకరిస్తుండటం గమనార్హం. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిశాయి.
చివరి వారంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు జోరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఏకంగా 3.35 శాతం పెరిగింది. స్థిరాస్తి రంగ సూచీ 4.34 శాతం మేర పతనమైంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, బ్యాంకు, ఫార్మా సూచీలు 3 శాతానికి పైగా ఎరుపెక్కాయి.
మెటల్, ఐటీ, ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ ఇందుకు జత కలిశాయి. బ్యాంకింగ్ రంగంలో సెంట్రల్ బ్యాంకు 8.42 శాతం లాభపడింది. యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, మహా బ్యాంకు ఐదు శాతం పెరిగాయి. బరోడా, ఇండియన్, యూకో, పీఎస్‌బీ, పీఎన్‌బీ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి.

ఈ వారం స్టాక్ రికమెండేషన్లు
గుజరాత్ స్టేట్ పెట్రోనెట్: బ్రాడర్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా ఈ కౌంటర్ లాభాల్లో దూసుకుపోతోంది. సెప్టెంబర్ ఆరంభం నుంచి డెలివరీ వాల్యూమ్ క్రమంగా పెరుగుతోంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది.
శుక్రవారం రూ.288 వద్ద ముగిసింది. ఈ స్థాయిల్లో కొని రూ.310/340 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. రూ.258ని గట్టి స్టాప్‌లాస్‌గా భావించాలి.
ఏసియన్ పెయింట్స్: చివరి నాలుగు సెషన్లలో ఈ షేర్లు లాభపడ్డాయి. మార్కెట్ సెంటిమెంటును పట్టించుకోకుండా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. రూ.3200 జోన్లో అక్యూమ్‌లేషన్ జరుగుతోంది.
ఏసియన్ పెయింట్స్‌ను రూ.3280 స్థాయిల్లో కొనుగోలు చేసి రూ.3400/3465 వరకు టార్గెట్ చేయొచ్చు. రూ.3260ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. డెలివరీ వాల్యూమ్ సైతం క్రమంగా బిల్డ్ అవుతోంది.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు: కొన్నాళ్లుగా ఈ షేర్లు గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతున్నాయి. రెండు వారాల నుంచి ఏయూ స్మాల్ బ్యాంకు షేర్లు అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. శుక్రవారం ఈ షేర్లు రూ.744 వద్ద ముగిశాయి.
ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పొజిషన్ తీసుకొని రూ.725ను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. రూ.790/810 వరకు టార్గెట్ చేయొచ్చు. ఈ మధ్యే మాక్స్ ఇన్సూరెన్స్‌తో టైఅప్ చేసుకుంది.
బంధన్ బ్యాంక్: జులైలో త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి బంధన్ బ్యాంకు షేర్లు టర్న్ అరౌండ్ అయ్యాయి. శుక్రవారం ఈ షేర్లు రూ.249 వద్ద క్లోజయ్యాయి. డెలివరీ వాల్యూమ్ సగటున 40 శాతంగా ఉంటోంది. మూమెంటమ్ చాలా బాగుంది. రూ.240 వద్ద ఈ షేర్లను కొనుగోలు చేసి రూ.270/310 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. రూ.222ను కఠిన స్టాప్‌లాస్‌గా భావించాలి.
ట్రెంట్: ఈ కంపెనీ షేర్లు పరుగులు పెడుతున్నాయి. రూ.2060 స్థాయిలో అక్యూమ్‌లేషన్ జరుగుతోంది. లో ఫ్లోట్ కావడంతో ఒడుదొడుకులు తక్కువే. ఈ స్టాక్‌ను రూ.2070 స్థాయిల్లో కొనుగోలు చేసి రూ.2155/2225 వరకు టార్గెట్ పెట్టుకోవాలి. రూ.2055ను గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709