365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,ఆగస్టు 22,2023: ఖమ్మం జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మాజీ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం తరపున టికెట్ ఆశించారు. ఐతే బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు.
పాలేరు టిక్కెట్టును తుమ్మల బలంగా కోరుకున్నారు. కేసీఆర్ నిర్ణయం ఖమ్మంజిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని కొందరు నేతలు తుమ్మల దృష్టికి తీసుకెళ్లగా.. తన ప్రయోజనాలను తానే చూసుకుంటానని బదులిచ్చినట్లు సమాచారం.
దీంతో ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మరేదైనా పార్టీలోకి మారాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఆయన రాజకీయ వారసత్వాన్ని, పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు ఆయన్ను తమ గూటికి ఆహ్వానించేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు వినికిడి.
కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి తదితరులకు తుమ్మల అత్యంత సన్నిహితుడు. ఆయనను ఆహ్వానించేందుకు తమపార్టీ సిద్ధంగా ఉందని, ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నా తాము తుమ్మలకు అవకాశం ఇస్తామని చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడైన ఎలాగైనా తమపార్టీలోకి తీసుకురావాలని బిజెపి కూడా ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఐతే తుమ్మలకు బీజేపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన సమీప బంధువు, రాజ్యసభ మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పైగా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి మారిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంపై తుమ్మల వర్గీయులు మండిపడుతున్నారు.
ఈ పరిణామాల మధ్య తుమ్మల సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తన అనుచరులతో ముచ్చటించారు. తనకు ఎంపీ సీటు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు మరో పార్టీలో చేరక పోవచ్చని తెలుస్తోంది.