365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జూన్ 1,2021: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు.
ఉదయం 9.30 నుండి 10.30 గటంల వరకు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ సత్రేనాయక్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.