365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ సెప్టెంబర్ 26,2023:హమ్మయ్య..! వరుస నష్టాలకు తెరపడిందని ఆనందించేలోపే మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. మంగళవారం బెంచ్ మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ ఎరుపెక్కాయి.
సుదీర్ఘకాలం వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలోనే ఉంచుతారన్న సంకేతాలతో ఐరోపా మార్కెట్లు పతనమవుతున్నాయి.ఎమర్జింగ్ ఆసియా మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది.
చైనాలో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. వివిధ అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యహరిస్తున్నారు. దాంతో ఉదయం నుంచీ సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి.
చివరికి నిఫ్టీ 9, సెన్సెక్స్ 78 పాయింట్లు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్లో 66,023 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,071 వద్ద మొదలైంది.65,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.66,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 78 పాయింట్లు తగ్గి 65,945 వద్ద ముగిసింది.
మంగళవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,682 వద్ద ఓపెనై 19,637 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,699 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 9 పాయింట్లు నష్టపోయి 19,664 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 141 పాయింట్ల నష్టంతో 44,624 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభపడగా 23 నష్టపోయాయి. ఐచర్ మోటార్స్ (2.61%), హీరో మోటో కార్ప్ (2.13%), నెస్లే ఇండియా (1.51%), ఓఎన్జీసీ (1.32%), బజాజ్ ఆటో (1.30%) టాప్ గెయినర్స్. సిప్లా (1.37%), టెక్ మహీంద్రా (1.29%), ఇండస్ ఇండ్ బ్యాంకు (1.14%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (0.95%), ఏసియన్ పెయింట్స్ (0.94%) టాప్ లాసర్స్.
రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియాల్టీ, మెటల్, ఎనర్జీ సూచీలు పెరిగాయి. నేడు మీడియా, పీఎస్‌యూ బ్యాంకు, ఐటీ, బ్యాంకు సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. ఫార్మా, ఫైనాన్స్ రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది.
రెండు రోజులుగా నష్టపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నేడు నిఫ్టీకి అండగా నిలబడింది. బజాజ్ ఫైనాన్స్, ఎల్‌టీ, నెస్లే ఇండియా దానికి తోడయ్యాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్ నష్టాలతో సూచీ ఒడుదొడులకు లోనైంది.
నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,700 వద్ద రెసిస్టెన్స్, 19,620 వద్ద సపోర్టు ఉన్నాయి. ఐచర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్, గ్రాసిమ్ ఇండస్ట్రీ షేర్లను ఇన్వెస్టర్లు, ట్రేడర్లు స్వల్ప కాలానికి కొనుగోలు చేయొచ్చు.
బ్రోకేజీ సంస్థల నుంచి పాజిటివ్ రేటింగ్స్ రావడంతో ఆటో స్టాక్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే నాలుగు శాతం పెరిగాయి. నిఫ్టీలోని ఐదు ఆటో స్టాక్స్‌లో మూడు లాభాల్లోనే ముగిశాయి. యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు వార్తలతో ఐటీ స్టాక్స్‌పై ప్రెజర్ కనిపిస్తోంది.
వొడాఫోన్ ఐడియా షేర్లు 20 నెలల్లోనే గరిష్ఠ స్థాయికి ఎగిశాయి. ధరల పెరుగుదలతో సిమెంటు షేర్లు లాభపడుతున్నాయి. వరల్డ్ కప్ నేపథ్యంలో సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గుతుందన్న అంచనాలతో పీవీఆర్ షేర్లు పడిపోతున్నాయి.
రెండో రోజు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఐపీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఓఎన్‌జీసీలో 11 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్‌లో 13.4 లక్షల షేర్లు చేతులు మారాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709