365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 10,2025: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2025 విజేతను నార్వేజియన్ నోబెల్ కమిటీ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది ఈ గౌరవం వెనిజులా దేశానికి చెందిన ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మాచాడో (María Corina Machado)ను వరించింది.

ఈ ప్రకటనతో నోబెల్ బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

నోబెల్ కమిటీ ప్రకటన..

గౌరవం దేనికంటే: వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను (Democratic Rights) కాపాడేందుకు ఆమె చేసిన అలుపెరగని కృషి ,నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం చేసిన పోరాటాన్ని గుర్తించినట్లు కమిటీ తెలిపింది.

చీకటి అలుముకున్న వేళ కూడా ప్రజాస్వామ్య జ్వాలను వెలిగిస్తున్న ధైర్యవంతురాలిగా కమిటీ మారియా కోరినా మాచాడోను అభివర్ణించింది.
వెనిజులాలో రాజకీయంగా విభజన చెందిన ప్రతిపక్షాన్ని ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా.. దేశంలోనే ఉండి నిరంతరంగా పోరాడుతున్నారు.

ట్రంప్‌ ఆశలు.. నిపుణుల అంచనాలు..

నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్-గాజా మధ్య శాంతి ఒప్పందం (Ceasefire Deal) కుదర్చడంలో తాను కీలకమయ్యానని, గతంలోనూ ఏడు యుద్ధాలను ఆపేశానని ఆయన పదేపదే చెప్పుకొచ్చారు.

అయితే, చాలా మంది నోబెల్ పరిశీలకులు (Nobel experts) మాత్రం ట్రంప్‌కు ఈ బహుమతి దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ముందుగానే అంచనా వేశారు. ప్రజాస్వామ్య విలువలకు, అంతర్జాతీయ సహకారానికి ప్రాధాన్యత ఇచ్చే నోబెల్ కమిటీ, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ (America First) విధానాలను పరిగణలోకి తీసుకోదని స్పష్టం చేశారు.

ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ ధైర్యవంతురాలికి ఈ గౌరవం దక్కడం చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నోబెల్ శాంతి బహుమతి కింద మారియా కోరినా మాచాడోకు డిప్లొమా, గోల్డ్ మెడల్‌తో పాటు 1.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 10 కోట్లు) నగదు పురస్కారం లభిస్తుంది.