365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 20,2021:శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రెండేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండేళ్లుగా స్వామిసేవ, భక్తుల సేవ చేసుకోవడానికి అదృష్టం కల్పించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ధర్మకర్తల మండలి ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు. టిటిడి వద్ద నిల్వ ఉన్న రద్దయిన నోట్ల మార్పిడి అంశం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని, ఈ నోట్ల మార్పిడికి అనుమతించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను తాను నాలుగుసార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశానన్నారు. రిజర్వు బ్యాంకును కూడా అనేక సార్లు సంప్రదించామని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతోపాటు రెండేళ్లలో తమ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన కార్యక్రమాలను వై.వి.సుబ్బారెడ్డి పలువురు బోర్డు సభ్యులు, ఈవో డా.కెఎస్.జవహర్‌రెడ్డితో కలిసి మీడియాకు వివరించారు. అవేంటంటే…
– ప్రపంచ ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ గత 15 నెలలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాం. వీటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆశీస్సులతో త్వరలోనే ప్రజలంతా కరోనా మీద విజయం సాధిస్తారు.
– ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దు.
– తిరుమల పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధం. ఏడాదిగా సంపూర్ణంగా అమలు.
– రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించదలచిన 500 ఆలయాలను కరోనా కారణంగా నిర్మించలేకపోయాం. రాబోయే ఏడాదిలో ఈ ఆలయాల నిర్మాణం పూర్తి చేసేలా తీర్మానం.
– హిందూ ధర్మప్రచారంలో భాగంగా జమ్మూలో ఇటీవల భూమిపూజ చేసిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి ఉత్తర భారతదేశంలో గొప్ప ఆలయంగా తయారుచేసేందుకు నిర్ణయం.
– వారణాశి, ముంబయిలో ఏడాదిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు.
– గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో 100 ఆలయాలకు గోమాతలను అందించాం. మరో 40 ఆలయాలకు కూడా అందిస్తాం. దీనివల్ల ప్రజలు గోసేవ చేసుకునే అవకాశం కల్పించినట్టవుతుంది.
– తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం వాకిలి, వాకిలిచట్రం, గర్భగృహ ప్రవేశద్వారాలకు వెండి తొడుగులు అమర్చేందుకు నిర్ణయం.
– గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమం కింద గత 45 రోజులుగా సహజ ఆధారిత పంటలతో స్వామివారికి తయారు చేస్తున్న నైవేద్యాల కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ధర్మప్రచార పరిషత్ ద్వారా రైతులను సంసిద్ధం చేసి వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.
– మూడు నెలల్లోపు ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయం.
– దేశవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో దేవాలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు అందిస్తాం.
– తిరుపతి, తిరుచానూరులో నివసిస్తున్న అర్హత గల హెచ్‌డిపిపి పెన్షనర్లకు(పర్యవేక్షక మరియు నాన్-పర్యవేక్షక) ఇతర తితిదే పెన్షనర్ల తరహాలోనే పుణ్యక్షేత్ర భారబృతి భత్యం రూ.500/- నుండి రూ.700/-కు పెంచేందుకు ఆమోదం.
– టిటిడిలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఇదివరకే కమిటీని నియమించాం. ఈ కమిటీ విధి విధానాలతో మూడు నెలల్లో కమిటీ నివేదిక అందిస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా దీన్ని అమలుచేస్తాం.
– తిరుమలలో ఉన్న అనధికారిక దుకాణాలు, తట్టలను వారం రోజుల్లో తొలగిస్తాం. దుకాణదారులు టిటిడి అనుమతించిన వ్యాపారాలు మాత్రమే చేసేలా చర్యలు.
– త్వరలో ముఖ్యమంత్రి చేతులమీదుగా స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల అభివృద్ధి పనులతో పాటు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, తిరుమలలో కొత్తగా నిర్మించిన బూందీ పోటు ప్రారంభోత్సవం.
– రాష్ట్రంలో కొత్తగా 13 కల్యాణమండపాల నిర్మాణానికి ఆమోదం.
– తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఈ అంశంపై ఇక మీదట ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వరాదని తీర్మానం.
– తిరుపతిలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఆగిన చోట నుండి అలిపిరి వరకు గరుడ వారధి నిర్మాణానికి ఆమోదం. టిటిడి నిధులతో ఈ వారధి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయం.
– తిరుమలను గ్రీన్‌హిల్స్‌గా ప్రకటించినందున ఉచిత బస్సుల స్థానంలో త్వరలో విద్యుత్ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఆర్టిసి కూడా ఇందుకోసం 100 విద్యుత్ బస్సులు కొనుగోలుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనుమతించారు. తిరుపతి
– తిరుమల మధ్య నడిచే ప్రయివేటు ట్యాక్సీల యజమానులు టిటిడిని సంప్రదిస్తే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయించాలని నిర్ణయం.
– కోవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచాలని నిర్ణయం