365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జనవరి 24,2023: తిరుమల శ్రీవారి కొండపై డ్రోన్ షాట్ వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే..ఇటీవల వైరల్ అయిన శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజి బయటకువచ్చిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల భద్రతపై రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రోన్ సాయంతో శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజి చిత్రీకరించగా.. ఈ వ్యవహారంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తిరుమలలో భద్రత డొల్లేనంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. త్వరలోనే తిరుమలకు అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు.
ఇది ఎంతో ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ, భద్రతకే ప్రాధాన్యత ఇచ్చి ముందడుగు వేస్తున్నామని, వరైనా డ్రోన్లు ఎగరేస్తే, ఆ డ్రోన్లలో ఉండే కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ సిస్టమ్ అడ్డుకుంటుందని ఆయన వెల్లడించారు.
అత్యుత్సాహంతోనే శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్టు తెలుస్తోందని, ఆ వీడియోను ల్యాబ్ కు పంపామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.