365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ 31 అక్టోబర్, 2024: ఆకట్టుకునే కథలు, ఆసక్తికర మలుపులతో టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు, కుటుంబ విలువలను ప్రతిబింబించే కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంను నవంబర్ 4వతేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ సీరియల్‌లో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ప్రేమ, బాధ్యతలు,అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు, సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కానున్న ఈ సీరియల్ ఆత్మీయత, అద్భుతమైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
ఉమ్మడి కుటుంబం కథలో, ఆనంద భైరవి (రూప) తన కొడుకు కోసం తగిన భాగస్వామిని వెతికే సందర్భంలో, శాంతి, గౌరవం కలిగిన శరణ్య (సాక్షి)ను మంచి వధువుగా ఎంచుకుంటుంది. కానీ శరణ్య సోదరి అనన్య (సుస్మిత) పూర్తిగా విభిన్నమై స్వేచ్ఛయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ప్రవేశించడం, శరణ్య జీవితంలో కొత్త మలుపులు ఎలా తెస్తుందన్నది సీరియల్ ముఖ్యాంశం. ఈ సీరియల్‌లో ఆనంద పాత్రలో రూప, శరణ్యగా సాక్షి, యశ్వంత్‌గా దర్శన్ నటిస్తుండగా, కరమ్ (రోహిత్),అనన్య (సుస్మిత) కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
జీ తెలుగు ఉమ్మడి కుటుంబం ప్రారంభం సందర్భంగా, మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న సీతారామ సీరియల్ ప్రసార సమయం 3.30కి మారుతుంది. దీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరించిన సూర్యకాంతం సీరియల్ కూడా త్వరలో ముగియనుంది. అందువల్ల, కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతో పాటు మీ అభిమాన సీరియల్స్‌ను ఆయా సమయాల్లో చూడండి..!