365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. “తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం జరుగుతుందని ఆరోపణలు రావడంతో, ఇది శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం..
అన్యమత ప్రచారానికి సంబంధించి గతంలో ఫిర్యాదులు వచ్చినా, గత పాలకులు పట్టించుకోలేదని, “ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా, వారు స్పందించలేదు” అన్నారు.
కల్తీ ఆరోపణ..
“చంద్రబాబు వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోంది. ఇది అత్యంత నీచం” అని ఆయన అన్నారు. “హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోందని భావిస్తున్నాం” అని తెలిపారు.
సీబీఐ విచారణ ఆవశ్యకత..
“క్షమించరాని నేరానికి ఒడిగట్టారు. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఈ కల్తీ దందా జరిగే అవకాశం లేదు. కాబట్టి, సీబీఐతో సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత..
“రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోండి” అని ఆయన కోరారు.
అన్యమత ప్రచారం..
“హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం పూర్తిగా నిషేధించాలి. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోంది” అని, “తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేయాలి” బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.