365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ డిసెంబర్ 3,2025: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) ఉపకులపతి (వీసీ) డా. అల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి నేడు (ఈరోజు) కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను చూసి ఎటువంటి అపోహలకు, అనుమానాలకు లోను కావొద్దని ఆయన సూచించారు.
ఉద్యోగుల జీతాల చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం కోసం,సమాచారాన్ని రికార్డు చేయడం కోసమే రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధార్, పాన్ కార్డుల వివరాలను సేకరిస్తున్నదని ఆయన వివరించారు.

గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జానయ్య పేర్కొన్నారు.
విద్యా రంగం, విశ్వవిద్యాలయాల అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినప్పుడు కూడా ఆయన ఇటువంటి (స్వయం ప్రతిపత్తిని తగ్గించే) ఆలోచనను వ్యక్తం చేయలేదని, కాబట్టి స్వయం ప్రతిపత్తి విషయం లో ఎటువంటి అపోహలకు తావు లేదని జానయ్య స్పష్టం చేశారు.,
