Tue. Dec 24th, 2024
banumathi

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 24,2022: భానుమతీ రామకృష్ణ ” మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినిమా ” అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం-ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.

banumathi

భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం. జీవిత విశేషాలు :-1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు.

హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.1939 సంవత్సరంలో తొలిసారిగా “వర విక్రయం” అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన “కృష్ణప్రేమ”, “స్వర్గసీమ” చిత్రాలు మలుపుతిప్పాయి.

banumathi

ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.

banumathi

ఆమెకు జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి బయటి వారికి కొద్ది మందికే తెలుసు.1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రందాల మీద పరిశోధన చేసారంటే ఈనాడు చాలామంది నమ్మలేరు. కానీ అది సత్యం. ఎమ్జీ ఆర్ కు రాజపరిపాలనాయోగం ఉందని ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్ విరామ సమయంలో చేతిరేఖలు చూచి చెప్పిన సాముద్రిక వేత్త భానుమతి గారు. ఆ సంగతి ఆమె మరచి పోయినా, తాను ముఖ్యమంత్రి అయినసమయంలో ఎమ్జీ ఆర్ ఆమెకు గుర్తు చేసారట.

అంతేకాదు ఆమె శ్రీ విద్యోపాసకురాలనీ బాలా, నవాక్షరీ మంత్రాలను శృంగేరి శంకరాచార్యులూ మహా తపస్వులూ అయిన అభినవవిద్యాతీర్థస్వామివారి నుంచి ఉపదేశం పొంది నిత్యమూ లలితా సహస్ర నామాలతో శ్రీ చక్రాన్ని అర్చించేవారనీ , సప్తశతీ పారాయణ చేసేవారనీ కొద్దిమందికే తెలుసు. అటువంటి ఉపాసకురాలికి జ్యోతిష్య జ్ఞానం పట్టుబడటం వింతేముంది ? సినిమాలలో :-రమారమి అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే.

banumathi

ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే అనుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నాడు. ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది.

“చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు” – ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో “తెలుగు వెలుగులు” శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.

banumathi

కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల “భానుమతి”గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో. భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్దవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నది.

2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించారు.అవార్డులు:-1956నందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు) అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు. తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు.

banumathi

1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. 1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984 కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది. బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది. 1984లో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.

banumathi

భానుమతి రచనలు :- అత్తగారి కధలు నాలో నేనుభానుమతీ రామకృష్ణ నవంబరు 1947 చందమామ పత్రికలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం ఫిలింకు పాట పిల్లలకు ఆట రాజుకు కోట ఉండాలోయ్ ఉండాలి అత్తకు నోరు దేవుడికి తేరు స్టారుకు కారు ఉండాలోయ్ ఉండాలి స్టేజీకి తెర కత్తికి ఒర చేపకు ఎర ఉండాలోయ్ ఉండాలి యింటికి అమ్మ నిమ్మకి చెమ్మ కొలువుకి బొమ్మ ఉండాలోయ్ ఉండాలి తలుపుకి గడి దేవుడికి గుడి అవ్వకు మడి ఉండాలోయ్ ఉండాలి జూదరికి పేక గొడ్లకి పాక గాంధీకి మేక ఉండాలోయ్ ఉండాలి అరవలకు పొగాకు ఆంధ్రులకు గోగాకు మళయాళులకు తేయాకు ఉండాలోయ్ ఉండాలి.

error: Content is protected !!