![](http://365telugu.com/wp-content/uploads/2021/12/ttd-1024x768.jpg)
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, 4డిసెంబర్, 2021: భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి నేటి నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో ఛైర్మన్ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.
అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియ లోని మిగిలిన సగా భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల భద్రత ముఖ్యమని ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు.
డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాక పోకలు సాగుతున్నందువల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమల లో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమల కు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో లు సదా భార్గవు, వీరబ్రహ్మం, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి, ఢిల్లీ ఐఐటి నిపుణులు శ్రీ రావు, ఇంజినీరింగ్ సలహా దారు రామచంద్రా రెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వర రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.