365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,7 డిసెంబర్,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ అశ్వం సాక్షి గా నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.