365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,డిసెంబర్ 27, 2022: తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు.
వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 చోట్ల జనవరి 1న సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
రోజుకు 50 వేల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇస్తామన్నారు.
అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వేస్టేషన్ వెనకున్న 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, భైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్‌పి హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో టోకెన్లు ఇస్తామన్నారు.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని సింఘాల్ కోరారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో వేచిచూడకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి రావాలని కోరారు.