365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఆగస్టు 20,2021:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.
అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించవలసిన విధానాన్ని ఆగమ పండితులు శ్రీ శ్రీనివాసాచార్యులు తెలియజేశారు.
తరువాత ఐదు రకాల కుడుములతో పాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
2713 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసి వర్చువల్ గా ఈ వ్రతంలో పాల్గొన్నారు. భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ప్రపంచ ప్రజలు కరోనా నుంచి బయట పడాలని కోరుకున్నా : టీటీడీ చైర్మన్ ,వైవి సుబ్బారెడ్డి
ప్రపంచ ప్రజలందరూ త్వరితగతిన కరోనా నుంచి బయటపడాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నట్టు టీటీడీ చైర్మన్,వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన వరలక్ష్మీవ్రతంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం వైవి.సుబ్బారెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా తులాభారం ప్రారంభించాలని గత పాలకమండలిలో తీర్మానించామన్నారు. చెన్నైకి చెందిన దాత రూ.17 లక్షలతో అమ్మవారికి తులాభారం కానుకగా సమర్పించారని చెప్పారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం తులాభారం ప్రారంభించామని ఆయన తెలిపారు. లక్ష్మీదేవి అమ్మవారు ప్రజలందరికీ సకల శుభాలు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
వరలక్ష్మీ వ్రతంతో అష్టలక్ష్మీ పూజాఫలం : టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల అష్టలక్ష్మీ పూజాఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారని ఆయన చెప్పారు.
కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి వ్రతాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించామన్నారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు వర్చువల్ విధానంలో ఈ సేవ నిర్వహించామని, దాదాపు 2700 మంది భక్తులు ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారని తెలిపారు. వీరితో పాటు లక్షలాది మంది భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వరలక్ష్మీ వ్రతాన్ని తిలకించారని వివరించారు.