365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుచానూరు,మే 27
2021: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం మహా పూర్ణాహూతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగుస్తాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ మధు, ఇతర అధికారులు పాల్గొన్నారు.