365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 9,2024: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే వారికి కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
అదరగొట్టే బ్యాటింగ్‌తో పాటు, పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అతడిని వేలానికి విడుదల చేసి, మళ్లీ భారీ మొత్తం రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేయడంతో వెంకటేశ్ అయ్యర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ లెఫ్ట్ హ్యాండ్ డైనమిక్ బ్యాట్స్‌మన్ తన వ్యక్తిగత విషయాలను ఆసక్తికరంగా పంచుకున్నాడు. ప్రస్తుతం తాను ఫైనాన్స్ సబ్జెక్టుతో పీహెచ్‌డీ చేస్తున్నట్టు వెల్లడించిన ఆయన, ఈసారి తనను ఇంటర్వ్యూ చేసే సమయానికి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్ అవుతానంటూ హాస్యంగా వ్యాఖ్యానించాడు.
క్రికెటర్లకు కేవలం ఆటపైనే కాదు, ఇతర అంశాలపై కూడా జ్ఞానం పెంపొందించుకోవాలని వెంకటేశ్ అభిప్రాయపడ్డాడు. కనీసం డిగ్రీ లేదా పీజీ వరకు చదువుకోవడం అవసరమని తెలిపాడు. మధ్యప్రదేశ్ రంజీ టీమ్‌లోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లను చూసి, “మీరు చదువుకుంటున్నారా?” అని తప్పకుండా అడుగుతానని చెప్పాడు.
“జీవితాంతం క్రికెట్ ఆడలేము, కానీ విద్య మన జీవితాన్ని చివరివరకు ప్రభావితం చేస్తుంది. అది మనకు మంచి నిర్ణయాలను తీసుకునే శక్తిని ఇస్తుంది,” అని వివరించాడు.
తాను 2018లో ఫైనాన్స్ సబ్జెక్టుతో ఎంబీయే పూర్తి చేసిన అనంతరం డెలాయిట్‌లో ఉద్యోగ అవకాశం వచ్చినా, క్రికెట్‌పై దృష్టి సారించడంలో ఆటంకం కలుగుతుందని ఆ ఆఫర్‌ను తిరస్కరించానని వెంకటేశ్ అయ్యర్ చెప్పారు .