
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,జులై 8,2021: హనుమంతుని జన్మక్షేత్రంపై ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జులై 30, 31వ తేదీల్లో తిరుపతిలో వెబినార్ నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. టిటిడి పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో గురువారం ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులతో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. వెబినార్‌లో ఆంజనేయుని జన్మస్థలానికి సంబంధించిన ప్రామాణికత, ఇతర అంశాలు ఉంటాయి.

ఇందులో పురాణాల ప్రామాణికత, వేంకటాచల మహత్యం ప్రామాణికత, తిరుమల ఇతిహాసం, తిరుమలతో ఆంజనేయునికి ఉన్న పురాణ సంబంధ అంశాలు, శ్రీ వేంకటేశ్వర ఇతిహాసమాల ప్రాశస్త్యం అంశాలు ఉంటాయి. వీటితో పాటు హనుమంతుని జన్మస్థలం, వాఙ్మయ ప్రమాణాలు, సంస్కృత వాఙ్మయం హనుమంతుడు, వైష్ణవసాహిత్యంలో తిరుమల, శాసనప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలు ఇతర అంశాలపై వెబినార్ నిర్వహిస్తారు. ఈ వెబినార్‌లో మఠాధిపతులు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధకులు పాల్గొంటారు.