ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన ప్రస్తుతం రాజకీయ కూడలిలో వున్నది. రానున్న ఎన్నికలలో జనసేన వైఖరి ఏ విధంగా వుండాలన్న విషయంపై స్పష్టత లేదు. జన బహుళ్యం లో అశేష జనాభిమానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి…? రాజకీయ పొత్తులపై భిన్న ప్రకటనలు ఆ పార్టీ యంత్రాంగాన్ని సైతం గందరగోళంలో పడేశాయి.
రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా రూపుదిద్దుకునేందుకు జనసేనకు ఎన్నో అవకాశాలు వున్నాయి. అయితే వాటన్నింటిని జనసేనాని సద్వినియోగం చేసుకుంటున్నారా..? లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రధానంగా ఎన్నికల పొత్తులపై జనసేనాని చేసిన, చేస్తున్న ప్రకటనలు అవగాహనా లేమిని, తొందరపాటు తనాన్ని సూచిస్తు న్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బిజెపితో మైత్రి కొనసాగిస్తున్నది. ఈ నేపధ్యంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఆ రెండు పార్టీల మధ్య మైత్రీబంధం కొనసాగింపును ప్రశ్నార్ధకం చేసింది.
“రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే తమ లక్ష్యం. అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం” అని జనసేనాని చేసిన ప్రకటనను అందరూ స్వాగతించారు. అయితే అంతలోనే ఆ క్రమంలో కేంద్రంలో ఇచ్చే బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించటాన్ని ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో బిజెపి పార్టీ కి ఏమాత్రం బలం లేదు. జనసేనకు స్థిరమైన ఓటు బ్యాంకు వున్నది. దీనికి తోడు తటస్థ ఓటర్లను ఆకర్శించేందుకు పవన్ చరిష్మా ఎంతగానో దోహదపడుతున్నది. అటువంటి పరిస్థితుల్లో బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం జనసేన ఎదురుచూడటం ఏమిటి..? అన్న ప్రశ్న తలెత్తుతోంది…? బిజెపి పంజరంలో నుంచి పవన్ బయటపడలేక పోతున్నారన్న భావన చాలామందిలో ఏర్పడింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకుంటే ఉభయతారకంగా వుంటుందనేది అధికశాతం పార్టీ శ్రేణులలో నెలకొని వున్నది.
జనసేనాని సైతం వ్యక్తిగతంగా అదే అభిప్రాయంలో వున్నట్టు చర్చ నడుస్తున్నది. అదేసమయంలో రాష్ట్రంలో తాను ద్వేషించే వైసీపీ తో బిజెపి లోని కొంతమంది నాయకులు సానుకూలంగా వ్యవహరించటాన్ని జనసేనాని జీర్ణించు కోలేకపోతు న్నారు. ఈ నేపధ్యంలోనే ఇరు పార్టీ ల మధ్య మైత్రి కి ముప్పు వాటిల్లే పరిస్తితి ఉత్పన్నమైయింది.
రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగనున్న ఉపఎన్నిక సందర్భంగా బిజెపి-జనసేన పార్టీల మధ్య బంధం బీటలు వారిన సంకేతాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ దూరంగా వుంది. అయితే బిజెపి తన అభ్యర్ధిని పోటీలో నిలిపింది. అయినప్పటికి బిజెపి అభ్యర్ధికి జనసేన మద్ధతు ప్రకటించ లేదు.గతంలో బద్వేలు ఉపఎన్నిక జరిగినప్పుడు బిజెపి నిలబెట్టిన అభ్యర్ధికి జనసేన మద్ధతు ప్రకటించింది. ఇప్పుడా పరిస్తితి లేకపోవటంతో ఆ రెండు పార్టీ ల మధ్య మైత్రీ బంధం ముగిసినట్టే అన్న భావన కలుగుతున్నది.
పొత్తుల విషయంపై జనసేనాని చేస్తున్న తాజా ప్రకటనలు బిజెపితో పొత్తు వుండదన్న ప్రచారాలను ధ్రువపరచే విధంగా ఉంటున్నాయి. బాపట్ల జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేనాని పొత్తులపై విస్పష్టమైన ప్రకటన చేశారు. జనసేనకు ప్రస్తుతం ప్రజలతో మాత్రమే పొత్తు ఉన్నదని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా ప్రస్తుతం తమకు బిజెపి తో మాత్రమే పొత్తు ఉన్నదని చెప్పేవారు. తాజాగా ప్రజలతో మాత్రమే పొత్తు వున్నదని చెప్పటం రానున్న రాజకీయ పరిణామాలకు సూచికగా భావించవచ్చు. జనసేన ఆవిర్భావ సభలోనే ఈ విధమైన ప్రకటన చేసి వుంటే ఇంత అయోమయ వాతావరణానికి ఆస్కారం వుండేది కాదు.
జనసేనాని తాజా ప్రకటనలను పరిశీలిస్తుంటే పొత్తుల విషయంపై ఇప్పటివరకు ఇతమిద్ధంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారన్న భావన తలెత్తుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలనే విషయంలో మాత్రం జనసేనాని స్పష్టమైన వైఖరితోనే వున్నారు. అయితే ఆక్రమంలో బిజెపి తోనా..? లేదా తెలుగుదేశం పార్టీ తోనా..? లేక రెండింటి తోనా.. దీనికి టీడీపీ బీజేపీ కలసి ఒప్పుకొంటా యా..!? దేనితో కలసి పయనం సాగించాలి..? లేదంటే జనసేన ఒంటరిగానే ముందుకువెళ్లాలా..? అనే మీమాంసలో జనసేనాని వున్నట్టు అవగతం అవుతుంది.