365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 8,2022: ‘ఒక్కసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది.
అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. దీంతో అందులో ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిలువ ద్వారా విష పదా ర్థాలు కూడా ఏర్పడతాయి. ఒకసారి వాడితే శరీరంలో రకరకాల అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ చేస్తున్న ఆహార నాణ్యత తనిఖీల్లో.. వంటనూనెను పదే పదే మరిగిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో తక్షణం చిరు వ్యాపారులంద రికీ జీహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమం ప్రారంభించింది. అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారు చేసే చర్యలకు ఉపక్రమించింది.
భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న రూకో (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్) కార్యక్రమంలో భాగంగా వృథా నూనెను సేకరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇలా సేకరించిన నూనెను బయో డీజిల్ కేంద్రాలకు తరలించి బయో డీజిల్ గా మార్చుతున్నారు.