365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 22,2022: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బేగంపేట లోని హరితప్లాజా లో తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, MLC బండ ప్రకాశ, MLA ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పిట్ల రవీందర్, మత్స్యకార JAC చైర్మన్ మల్లయ్య, వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకార సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ నీటి వనరుల లో (ఇన్ లాండ్ ) చేపల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. 2014 కు ముందు మత్స్య రంగం పూర్తి నిరాదరణకు గురైందని అన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలి, కులవృత్తుల పై ఆధారపడిన వారి జీవితాలలో వెలుగులు నింపాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి KCR గారి ఆదేశాల మేరకు అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
పూర్తిగా ధ్వంసమైన చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. కాళేశ్వరం వంటి నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. అన్ని నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని నీటి వనరులలో చేప పిల్లలను వదులుతున్నామని పేర్కొన్నారు. 2014 కు ముందు 1.90 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మత్స్య సంపద 4 లక్షల టన్నుల కు పెరిగిందని, ఇది మత్స్య శాఖ అభివృద్ధి సాధించిందని చెప్పేందుకు నిదర్శనం అన్నారు.
వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 7, 8, 9 తేదీలలో జిల్లాలలో మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం 10 కోట్ల మేర చేప పిల్లల ఉత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు.
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు, చేపల చెరువుల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని వివరించారు. అన్ని వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. పంచాయితీరాజ్ పరిధిలో ఉన్న చెరువుల వలన మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని చెరువులను మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా వివిధ మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మద్య ఉన్న విబేధాలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యలను ఈ కమిటీ పరిష్కరించిందని అన్నారు. జిల్లాల సంఖ్య 10 నుండి ౩౩ కు పెరిగిందని, అందుకు తగినట్లు ౩౩ జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రభుత్వ లబ్ది అర్హులైన ప్రతి మత్స్యకారుడికి అందాలనే 18 సంవత్సరాలు నిండిన మత్స్య కారుడికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నే అత్యధికంగా 3.50 లక్షల మంది సభ్యులతో 5 వేల మత్స్య సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గతంలో మత్స్య సొసైటీ లలో ఈ వృత్తికి సంబంధం లేని వారు సభ్యులు గా నమోదయ్యారని, తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారులకు మాత్రమే సొసైటీలలో సభ్యత్వం కల్పిస్తున్నదని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు ఉన్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదన్నారు. తక్కువ ధరకు చేపలను అమ్ముకొని నష్టపోవద్దని కోరారు.
మత్స్యకారులకు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో సబ్సిడీపై వాహనాలు, పరికరాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. చేపల విక్రయాలు జరుపుకొనేందుకు 100 కు పైగా ఫిష్ ఔట్ లెట్ వాహనాలను సబ్సిడీ పై అందించినట్లు తెలిపారు. ఒక్కో వాహనం ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా, 4 లక్షల రూపాయలకే పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు.
అనంతరం 6 ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మంత్రి చేతుల మీదుగా మెమెంటో లను అందించడం జరిగింది, అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి సభ్యత్వాలు చేపట్టి ఏర్పాటు చేసిన 15 నూతన సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లను కూడా అందించడం జరిగింది.