365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,ఆగష్టు 23, 2022: ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన ఉలవపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవపాడుకు చెందిన కుంచాల భార్గవి(19) దర్గాసెంటర్‌లో నివాసం ఉంటోంది.
అదే కాలనీకి చెందిన మాల్యాద్రి, భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మాల్యాద్రి అందుకు నిరాకరించి బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసింది.
ఈ నెల 10న జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భార్గవి ఇంటికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో యువతి సమస్యను తెలియజేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏఎస్సై సుబ్బారావును పిలిపించి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకుంది.