365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 9, 2025: నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కూడా ఇప్పుడు పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది.

ఇటీవల వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్‌ను దుర్వినియోగం చేస్తున్న వినియోగదారులపై చర్యలు తీసుకుంటోంది.

అంటే, ఒకే ఇంట్లో ఉండని యూజర్లు తమ స్నేహితులు, బంధువులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకొని యూట్యూబ్ ప్రీమియంను ఆస్వాదిస్తున్న వారిపై ఆంక్షలు విధించనుంది.

పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఆపడానికి నెట్‌ఫ్లిక్స్ ఇటీవల తీసుకున్న చర్యల మాదిరిగానే యూట్యూబ్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

నిజానికి, యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ. 299. ఈ ప్లాన్‌లో ఫ్యామిలీ మేనేజర్‌తో పాటు మొత్తం 5 అకౌంట్‌లను యాడ్ చేయవచ్చు. అయితే, ఒకే ఇంట్లో నివసించే వారు మాత్రమే ఈ ప్లాన్‌లో సభ్యులుగా ఉండాలనే నిబంధన ఉంది.

ఇప్పటివరకు ఈ నిబంధన కేవలం పేరుకే ఉండేది. కానీ చాలా మంది యూజర్లు తమ స్నేహితులు, బంధువులను కూడా ఈ ప్లాన్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు గూగుల్ ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయబోతోంది.

ఈమెయిల్ పంపి కంపెనీ హెచ్చరిక..

ఆండ్రాయిడ్ పోలీస్ నివేదిక ప్రకారం, పాస్‌వర్డ్ షేర్ చేస్తున్న కొంతమంది వినియోగదారులకు కంపెనీ ఒక ఈమెయిల్ పంపింది. ఆ మెయిల్ సబ్జెక్ట్‌లో ‘మీ యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ మెంబర్‌షిప్ నిలిపివేయబడుతుంది’ అని స్పష్టంగా పేర్కొంది.

ఒకే ఇంట్లో ఉండాలి..

మెయిల్‌లో, ఫ్యామిలీ ప్లాన్ సభ్యులందరూ ఒకే ఇంట్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నియమాన్ని పాటించని యూజర్ల ప్రీమియం సేవలను 14 రోజుల తర్వాత నిలిపివేస్తారు. ఇప్పటివరకు ప్రతి 30 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్ చెక్-ఇన్ జరిగేది.

కానీ దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, తప్పుడు చిరునామా ఇచ్చిన వినియోగదారులకు ప్రకటనలతో కూడిన యూట్యూబ్ యాక్సెస్ మాత్రమే లభిస్తుంది.