365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 24,2023: వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిలను అరెస్టు చేయడానికి లోటస్ పాండ్ వద్దకు చేరుకున్న పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు.
లోటస్ పాండ్ వద్ద నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను నిలదీశారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో ఓ పోలీసు అధికారిని షర్మిల తోసేశారు.
ఆ తరువాత ఆమె అక్కడే రోడ్డుపై బైఠాయించారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆమెను అడ్డుకుంటుండగా.. వారిని నెట్టేసి ప్రశ్నిస్తూ ముందుకు కదులుతూ వచ్చారు. అయితే అడ్డొచ్చిన మహిళా కానిస్టేబుల్ చెంపపై షర్మిల కొట్టినట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకోగా..”నన్నెందుకు కొడుతున్నావ్” అంటూ ఆ ఎస్సై షర్మిలను ప్రశ్నించారు. కాగా నిరుద్యోగ ధర్నాకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోల్లో ఈ విషయం అర్ధమవుతుంది. చివరకు షర్మిలను మహిళా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే వైఎస్ షర్మిల తీరుతో పోలీసులు చుక్కలు చూశారు. అడ్డుకుంటున్న మహిళా కానిస్టేబుళ్లను నెట్టేయగా..ఇతర పోలీసులను ప్రశ్నిస్తూ వచ్చారు. అలా నడుచు కుంటూ వస్తున్న ఆమె తన కాన్వాయ్ ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. దీనితో ఆమె దిగగా పోలీస్ వాహనంలోకి ఎక్కించేందుకు చూశారు. కానీ అక్కడే ఉన్న ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకున్నారు. దీనితో ఆ ఎస్సై తిరిగి ప్రశ్నించగా ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై షర్మిల ఇతర పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పై పోరాడడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు నిరుద్యోగ దీక్షకు దిగారు. కానీ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి నిరాకరించగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు షరతులతో కూడిన దీక్షకు అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో షర్మిల సోమవారం నిరుద్యోగ దీక్షకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే షర్మిలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 353, 330 కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. షర్మిల తల్లి విజయమ్మ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోపక్క పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.