
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, సెప్టెంబర్ 2,2021:టిటిడి ఆగమ సలహాదారు, అర్చకస్వాములతో చర్చించి ఆయా ఆలయాల్లో విశేషమైన రోజున నూతన సేవలను ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. శ్రీనివాసమంగాపురం, కపిలతీర్థం, ఒంటిమిట్ట తదితర గ్రూపు ఆలయాల అధికారులతో గురువారం సాయంత్రం జెఈవో శ్రీమతి సదా భార్గవి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలను ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా స్థలపురాణం, విశిష్టతను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని సూచించారు.

ప్రతినెలా ఆయా ఆలయాల్లో విశిష్టమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలయాల్లోని స్వామి, అమ్మవార్ల సేవల విశిష్టత, పాల్గొనే విధానం తదితర విషయాలను భక్తులకు తెలియజేయాలని కోరారు. ఆలయాల విశిష్టతకు సంబంధించి ఎస్వీబీసీ ద్వారా డాక్యుమెంటరీలు/ ప్రోమోలు తయారుచేయించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలన్నారు. ఆయా ఆలయాలకు ఉన్న రవాణా వసతులు, ఎలా చేరుకోవాలనే అంశాలను వెబ్‌సైట్‌తోపాటు ఆకర్షణీయంగా సూచికబోర్డుల ద్వారా తెలియజేయాలని సూచించారు. అన్ని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆలయాల వారీగా నెలకు దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య, వారికి కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై జెఈవో సమీక్షించారు.