Thu. May 30th, 2024
Talasani Srinivas Yadav, Minister

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 19,2020 హైదరాబాద్: ఈ సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని  పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పశుసంవర్ధక, మత్స్య, విజయ డెయిరీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య కమిషనర్ సువర్ణ, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, tslda ceo మంజువాణి, విజయ డెయిరీ md శ్రీనివాస్ రావు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందని చెప్పారు. గత సంవత్సరం సుమారు 53 కోట్ల రూపాయల ఖర్చుతో 15,715 నీటి వనరులలో 64 కోట్ల చేప పిల్లలు, 3.42 కోట్ల మంచినీటి రొయ్యలను విడుదల చేసినట్లు వివరించారు. ఈ సంవత్సరానికి ఎన్ని చేప పిల్లలు, ఎన్ని రొయ్య పిల్లలు అవసరం, ఎన్ని నీటి వనరులు ఉన్నాయో సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు. నూతన ప్రాజేక్ద్ట్ ల నిర్మాణంతో అనేక నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని, వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లల పంపిణీ తో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందటానికి దోహదపడతాయని మంత్రి చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల కారణంగా చేపల ధరలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కరోనా ప్రభావంతో రిటైల్ చేపల విక్రయాలు కొంతమేర తగ్గాయని చెప్పారు. మత్స్యకారుల నుండి నేరుగా మత్స్య ఫెడరేషన్ చేపలు కొనుగోలు చేసి హోల్ సేల్ మార్కెట్ ను నిర్వహించేందుకు ఉన్న అవకాశాలు, లేదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని మత్స్య కమిషనర్ సువర్ణ ను మంత్రి ఆదేశించారు. ఈ విధంగా చేయడం వలన మత్స్యకారులు తక్కువ ధరకు చేపలను అమ్ముకొని నష్టపోకుండా చూడవచ్చని అన్నారు. మత్స్య సహకార సొసైటీ లలో అర్హులైన ప్రతి మత్స్యకారుడు సభ్యుడిగా నమోదు చేసుకునేలా చూడాల్సిన బాద్యత జిల్లా మత్స్య అధికారులదే అన్నారు. ఫెడరేషన్ ను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. డెయిరీ పై సమీక్ష సందర్బంగా మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలోను ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలు, పాల ఉత్పత్తుల సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని అన్ని అంగన్ వాడి కేంద్రాలకు విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాదవ, కురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే పంపిణీ చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఎంతమందికి పంపిణీ చేశారు, ఇంకా ఎంత మంది లబ్దిదారులకు అందించాల్సి ఉంది నివేదిక సమర్పించాలని ఆదేశించారు.