Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు19, 2024 : హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి వర్గానికి ప్రాధాన్యత ఉన్నది, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం అభిప్రాయపడ్డారు.

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ వారి స్పూర్తితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన విధానాలు, చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరణ ఇచ్చారు.

ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టామని, ఇటీవలి విదేశీ పర్యటనలలో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ఫోర్త్ సిటీపై ఆసక్తి చూపిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

వ్యక్తిగత శ్రమ, విధేయత ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి చేరుస్తాయని, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ,కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు కష్టపడి పైకి వచ్చిన ఉదాహరణలుగా పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో క్షత్రియ భవన్ స్థలం కేటాయింపు,అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని, పేద క్షత్రియులకు కూడా సంక్షేమం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, పలువురు ప్రజా ప్రతినిధులు, క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!