365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 23,2024: రామకృష్ణ పరమహంస ధర్మపత్ని అయిన శారదామాతకు భక్తులపై మాతృవాత్సల్యం అపారమైందని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద అన్నారు. అమ్మని ఆర్తితో పిలుస్తే బిడ్డలను అక్కువ చేర్చుకునే దయామయి శారదామాత అని అన్నారు.
మఠానికి వచ్చే భక్తులకు అలసట, విరామం లేకుండా ఆప్యాయంగా భోజనం పెట్టే చల్లని తల్లి శారద మాత అని ఆయన గుర్తు చేశారు. నగరంలోని దోమల్‌గూడలో ఉన్న శ్రీరామకృష్ణ మఠంలో దివ్యజనని శ్రీ శారదాదేవి 172వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి.
ఉదయం సుప్రభాతం, మంగళహారతి, భజనలతో జయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం దేవాలయ ప్రదక్షిణం, లలితా సహస్రనామ పారాయణం, హోమం నిర్వహించారు.
మధ్యాహ్నం రెండు గంటలకు వివేకానంద ఆడిటోరియంలో భక్తులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో వాలంటీర్స్, భక్తులు తమ బంధుమిత్రులతో పాల్గొన్నారు.