365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి8,2025: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్, కళాశాల సంయుక్తంగా నిర్వహించిన అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్ సెంటర్పై అవగాహన సదస్సులో నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జామ్రే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగం, ఉద్యానవనం, ఫిషరీస్, డైరీ వంటి అనుబంధ రంగాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి నాబార్డ్, బ్యాంకులు లోన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

18 నుండి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారికి అవకాశం..


వివిధ అనుబంధ రంగాల్లో నాణ్యమైన వ్యాపార అవకాశాలు ఉన్నవారు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి నాబార్డ్ లోన్లు అందిస్తోంది. ఇందుకు 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని శ్రీకాంత్ జామ్రే పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని, అందులో రైతుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. వ్యవసాయ వ్యాపారాలను పెంపొందించేందుకు నాబార్డ్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

ఒక వ్యక్తికి రూ. 20 లక్షలు, గ్రూప్‌లకు కోటి రూపాయల వరకు లోన్లు
అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్ సెంటర్ పథకం కింద ఇంటర్మీడియట్ నుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ వరకు చదివిన అభ్యర్థులకు 45 రోజుల శిక్షణ అందించి, శిక్షణ పూర్తి చేసిన వారికి బ్యాంకుల ద్వారా రూ. 20 లక్షల వరకు లోన్ అందిస్తామని చెప్పారు. ఐదుగురు సభ్యులతో కూడిన గ్రూప్‌లకు కోటికి పైగా ప్రాజెక్ట్ కాస్ట్ అందిస్తామని వివరించారు. సాధారణ కేటగిరీ వారికి 30 శాతం సబ్సిడీ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 44 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు.

ఉద్యానరంగంలో కొత్త వ్యాపార అవకాశాలు..


కోవిడ్-19 తర్వాత ఉద్యానరంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు మరింతగా పెరిగాయని ఉద్యాన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిగం సైదయ్య పేర్కొన్నారు. హైడ్రోపోనిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, తేనె తయారీ, పుట్టగొడుగుల పెంపకం, ఔషధ ,సుగంధ పంటల సాగు వంటి రంగాల్లో వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

బ్యాంకులు కూడా ఎంటర్‌ప్రెన్యూర్లకు మద్దతు..


ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి బ్యాంకులు లోన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వనపర్తి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే తెలిపారు. నాబార్డ్ అమలు చేస్తున్న పథకాలు రైతులకు, యువతకు ఎంతో ఉపయోగపడతాయని మహబూబ్‌నగర్ క్లస్టర్ డీడీఎం షణ్ముఖ చారి, పి. మనోహర్ రెడ్డి వివరించారు.

పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమం..
ఈ అవగాహన సదస్సులో వనపర్తి జిల్లా అధికారులు గోవింద నాయక్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, గద్వాల్, నారాయణపేట జిల్లాల బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, డిస్ట్రిక్ట్ లీడ్ మేనేజర్లు, అంకుర పరిశ్రమల అధికారులు, అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపాళ్లు, ఫిషరీ కాలేజ్ ప్రిన్సిపాళ్లు, ఎఫ్ఈఓలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.