365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 2, 2025: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్లో కార్తీక వనభోజనాలు కార్యక్రమం అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అమృత, మణేమ్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా. హిప్నో పద్మా కమలాకర్ గార్ల ప్రత్యేక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక వనభోజనం అంటే ప్రకృతి మధ్య కూర్చుని భగవంతుని స్మరించుకోవడమే కాకుండా, సామూహికంగా శక్తిని పంచుకోవడమనే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
ఉత్సాహంగా పాల్గొన్న మహిళా భక్తులు..

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుభాషిణి, రాధమ్మ, దేవి, ఝాన్సీ, పద్మా, శ్రీవాణి, సరోజా, జయమ్మ సహా సుమారు 60 మంది మహిళా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులందరూ సంప్రదాయ దుస్తుల్లో వచ్చి, పార్కు వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మిక శోభతో నింపారు.
ముందుగా, భక్తులందరూ కలిసి సామూహిక పూజలు, దీపారాధన నిర్వహించారు. అనంతరం, కార్తీక మాసానికి చిహ్నంగా ఉన్న ఉసిరి చెట్టు కింద భక్తి గీతాలు ఆలపిస్తూ, పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
భక్తి, ఆనందం కలగలిసిన వనభోజనం..
వనభోజనంలో భాగంగా రుచికరమైన సాంప్రదాయక వంటకాలతో తయారుచేసిన భోజనాన్ని భక్తులందరూ కలిసి ఆరగించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, సామాజిక అనుబంధాలు బలపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం భక్తి భావంతో పాటు ఆహ్లాదకరమైన సామాజిక వాతావరణం వెల్లివిరిసింది.
