365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 29,2025: ఫిబ్రవరి 4న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో ఇంఛార్జి మణికంఠ చందోలుతో కలిసి భద్రత, జన రద్దీ నిర్వహణ, ఇతర సంబంధిత అంశాలపై సమీక్షించారు.

అదనపు ఈవో మాట్లాడుతూ, టిటిడి వివిధ విభాగాల అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులు సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర టీమ్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

సమగ్ర బందోబస్తు ప్రణాళికలు ముందుగానే రూపొందించి, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో మార్గం సులభతరం చేసేందుకు కార్యాచరణను రూపొందించాలని ఆయన ఆదేశించారు. అలాగే, సమాచారాన్ని సమయానికీ చేరవేయాలన్నారు.

అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు మరియు ఇతర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వర్చువల్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, జీఎం ఐటీ శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం ,ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.