365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై, ఫిబ్రవరి13, 2023: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులు సోమవారం రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసారు.
గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చత్తీస్ ఘడ్ కు బదిలీ అయిన నేపధ్యంలో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గవర్నర్ గా అందించిన సేవలను గుర్తుంచుకుంటారన్నారు.
మచ్చలేని వ్యక్తిత్వంతో, కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారన్నారు.

అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా, నిండైన హుందాతనంతొ వ్యవహరించారని, అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని గవర్నర్ తో జగన్ అన్నారు.
గవర్నర్‌గా రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించి, మంచి సంబంధాలు సజావుగా సాగడంలో కీలక భూమిక పోషించారని, రాజ్యాంగానికి వన్నెతెచ్చారని సీఎం అన్నారు.
ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని, రాష్ట్రం నుంచి వెళ్లవలసి రావటం బాధాకరమైనా, దేశంలోని మరో రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లడం ద్వారా అక్కడి ప్రజలకు మేలు చేయగలుతారని అన్నారు.

తొలుత రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉపకార్యదర్శి నారాయణ స్వామి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్ మల్లాది విష్ణు, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి రేవు ముత్యాల రాజు, ఎన్ టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, నగర పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా, ఉప కమిషనర్ విశాల్ గున్ని, రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.