Sun. May 19th, 2024
APIIC Chairman

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,జూలై, 22,2022 : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డిని అస్సాగో, డీఎక్స్ఎన్ పరిశ్రమల ప్రతినిధులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో అస్సాగో ప్లాంట్ ఏర్పాటుకు ఏడాదిన్నరలోగా రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రత్యక్షంగా 90 మందికి, పరోక్షంగా 120 మందికి, మొత్తంగా 200 మందికి ఉపాధి అవకాశాలు అందించే ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు పేర్కొన్నారు.

ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం సింగిల్ విండోలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు ఛైర్మన్ కు వెల్లడించారు. దీనిపై ఏపీఐఐసీ ఛైర్మన్ స్పందిస్తూ..దరఖాస్తును పరిశీలించి త్వరలోనే తదనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డీఎక్స్ఎన్ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ మంగేష్ , ప్రతినిధులు ఏపీఐఐసీ ఛైర్మన్ తో సమావేశమయ్యారు.

ఫార్మా, ఆహార పరిశ్రమలలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అందుకు కావలసిన భూకేటాయింపులు, మౌలిక సదుపాయాలపై ఛైర్మన్ తో చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నివేదికల పరిశీలన అనంతరం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ పేర్కొన్నారు. అనంతరం గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఏపీఐఐసీ ఛైర్మన్ ని కలిశారు. స్థానికంగా ఆటోనగర్ లో ఇబ్బందులను ఛైర్మన్ కు వివరించారు. త్వరలోనే వాటి పరిష్కారానికి ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి హామీ ఇచ్చారు.