Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 8, 2024: రవీంద్రభారతిలో ఆదివారం జర్నలిస్టుల పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల పట్ల తమ ప్రభుత్వ ఆలోచన స్పష్టంగా ఉందని అన్నారు. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని ఆయన అభివర్ణించారు. వారు సమాజానికి చేసే సేవలను గుర్తిస్తూ వారి సంక్షేమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు..

ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఎలాంటి అడ్డంకులు లేవని, జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. వృత్తిపరమైన గౌరవాన్ని ఇతరుల నుంచి పొందడం కష్టమని, జర్నలిస్టులే తమ గౌరవాన్ని నిర్మించుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థలపై నమ్మకం పెంచడం, ఆ వ్యవస్థల్లో జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం అభివర్ణించారు.

అంతేకాక, రాజకీయ పార్టీల అజెండాలను రక్షించేందుకు కొన్ని మీడియా సంస్థలు వాడుకుంటున్న దురుద్దేశాలు వెలుగులోకి వస్తున్నాయని, అసలు జర్నలిస్టులు మాత్రం వారి ప్రామాణికతను కాపాడుకోవాలని సూచించారు. భాష విషయంలో మర్యాద లేకుండా, ముఖ్యమంత్రి హోదాని అవమానించేవిధంగా వ్యవహరించడం సరికాదని ఆయన హెచ్చరించారు.

సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని,జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కార్డులు,అక్రిడేషన్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందు కు మీడియా అకాడమీకి కొత్త విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే అందుకోసం మీడియా అకాడమీకి రూ.10 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

error: Content is protected !!