365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,తిరుపతి,జులై 6,2021: టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్ధని టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎంఆర్.శరవణ, సుందరదాస్ అనే వ్యక్తులు తాము టిటిడి ఉద్యోగులమని, ఉద్యోగాలు ఇప్పిస్తామని 15 మంది నిరుద్యోగులను మోసం చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 476 / 2021u/s 420 r / w 34 IPC తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
గతంలో కూడా ఇదేవిధంగా టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.టిటిడిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, టిటిడి వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన (నోటిఫికేషన్ ) ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం పూర్తిగా అసాధ్యం. ఇలాంటి విషయాలపై టిటిడి గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి దళారుల మాటలు విని, మోసపోకుండా ఉండాలని టిటిడి కోరుతోంది.