Sat. Dec 21st, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 14, 2023: మన భారతీయ వ్యవసాయ వృత్తికి ప్రధాన ఆధారం వృషభం(ఎద్దు). సనాతన భారతీయ సంస్కృతిలో వృషభ విశిష్టత చాలా గొప్పది.

మహాశివుని వాహనం మొదలుకొని మన వైదిక ధర్మంలో అడుగడుగునా వృషభ విశిష్టత మనం దర్శిస్తూనే ఉన్నాము. అంతటి విశేషమైన వృషభాన్ని మన పూర్వికులు సదా ఆరాధిస్తూ వృషభ ఆరాధన గావించేవారు. అలా మన పూర్వికులు ఆచరించి ఆరాధించిన ఉత్సవాలలో వృషభోత్సవం ఒకటి.

ఈ ఉత్సవాన్ని లఘుడ ప్రతిపద నాడు ఆచరించాలి. లఘుడ ప్రతిపద అనగా కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ సంవత్సరం 14-11-2023 నాడు. ఈ వృషభోత్సవ సందర్బంగా మనకి పరోక్షంగాను ప్రత్యక్షంగాను మానవాళిని ఆహారాన్ని సేద్యం చేసి అందిస్తున్న రైతులని మనం సన్మానించడం విశేషం.

దేశం సుభిక్షంగా ఉంది అని చెప్పడానికి రైతు అంతర్గత బహిర్గత కృషి చాలా ఉన్నది. అలాంటి రైతుని మనం వృషభోత్సవ పండుగనాడు సన్మానించి మన కృతజ్ఞతలు తెలపడం ప్రతి మానవుని భాద్యతగా భావించాలి.

ఈ వృషభోత్సవం ఆచరించడం వలన వాతావరణం లోని మార్పుల వల్ల వాటిల్లే రోగాలను మనం అరి కట్టగలము. ఒక ఋతువు నుంచి మరో ఋతువు మారుతున్న సమయంలో వాతావరణం లో మార్పు వస్తుంది.

అలాంటి సమయంలో వృషభోత్సవ విధిలో మనము వృషభాల కొమ్ములకు ప్రకృతి సిద్ధమైన ఔషధ లేపనాన్ని(పసుపు, నువ్వుల నూనెతో) రాసి వాటి నుంచి వెలుపడే ఔషధ తత్వాలు గల గాలిని పీల్చడం ద్వారా ఋతు సంక్రమణ సమయ వ్యాధులను నివారించడానికి వీలుకలుగుతుంది.

మన పూర్వికులు ఆచరించి కనుమరుగు అయిన ఈ వృషభోత్సవం అను ఉత్సవాన్ని మళ్ళీ తిరిగి మానవాళికి పరిచయం చేస్తూ మానవాళిని ఉత్తేజ పరుస్తూ వైదిక వ్యవసాయ విషయంపైన విశేష కృషి చేస్తున్న కృషిభారతం సంస్థ ప్రతిఏటా వృషభోత్సవాలను నిర్వహిస్తోంది.

వందే వృషభం..

చికిలి.వశిష్ఠ నారాయణ శాస్త్రి.(ఋగ్వేద ఘనపాఠి)జ్యోతిష పండిట్ కృషిభారతం
https://krishibharatham.org/

error: Content is protected !!