Fri. Dec 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: మణికొండ అల్కపూరి కాలనీలో అక్రమంగా నడుస్తున్న కమర్షియల్‌ వ్యాపారాలపై హైడ్రా అధికారులు సడలింపుల్లేని చర్యలు తీసుకున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్‌ షట్టర్లను అధికారులు తొలగించారు.

రెసిడెన్షియల్‌ అనుమతులతో నిర్మించిన భవనాలను కమర్షియల్‌ వ్యాపార సముదాయాలుగా మార్చి వాడుతున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత వారం హైడ్రా కమిషనర్‌ రంగనాథన్ స్వయంగా స్పాట్‌ విజిట్‌ చేశారు. అప్పటి నుంచే ఈ చర్యలు ప్రారంభమయ్యాయని సమాచారం. కమిషనర్‌ ఆదేశాల మేరకు రెసిడెన్షియల్‌ భవనాలను అక్రమంగా కమర్షియల్‌ వ్యాపారాలుగా మార్చిన వాటి తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు.

వ్యాపారస్తులు vs అధికారులు: వాగ్వాదం
వ్యాపారస్తులు అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నామని, మణికొండ మునిసిపాలిటీకి కమర్షియల్‌ ట్యాక్స్‌లు చెల్లిస్తున్నామని వారు ఆరోపించారు.

రెసిడెన్షియల్‌ భవనాలు కమర్షియల్‌గా కన్వర్షన్‌ అయ్యాయని, కానీ ఇప్పుడు అక్రమ నిర్మాణాలుగా తేలుస్తూ తమపై అన్యాయ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

బాధితుల ఆరోపణలు
ఒక బడా వ్యక్తి ఒత్తిడి మేరకు ఈ కూల్చివేతలు జరిగాయని వ్యాపారస్తులు ఆరోపించారు. “మా వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తమ పలుకుబడి ఉపయోగించి కూల్చివేతలు జరిపించారని” బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి నోటీసులు లేకుండా తెల్లవారుజామున కూల్చివేతలు జరిపారని వారు ఆరోపించారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథన్‌ ఈ వ్యవహారంలో అంతగా ఆసక్తి ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు.

“డబ్బులు ఇవ్వకుంటే వ్యాపారాలు కూల్చివేస్తారా? మాకు న్యాయం చేయండి” అంటూ బాధితులు వేడుకుంటున్నారు.

error: Content is protected !!