365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 7,2025: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు నందగిరి హిల్స్, హుడా ఎంక్లేవ్ కాలనీలతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా, జూబ్లీహిల్స్ నందగిరి, హుడా ఎంక్లేవ్ లేఅవుట్ పార్కు కబ్జా విషయం, గురుబ్రహ్మనగర్ బస్తీ ఆక్రమణలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టారు.
గురుబ్రహ్మనగర్ బస్తీ ప్రాంతంలో, 2 బెడ్ రూంలు నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో, నందగిరి హిల్స్,హుడా ఎంక్లేవ్ ప్రాంతాల్లో కూడా పార్కు స్థలాలను కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని వాసులు కమిషనర్ గారికి ఫిర్యాదు చేసారు.
ఈ అంశంపై స్పందించిన కమిషనర్, డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్) ద్వారా సర్వే చేపట్టి, సరిగ్గా నిర్ధారించిన తర్వాత విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే, బాధ్యుల నుంచి ఆధారాలను సేకరించి, వాటిని తనిఖీ చేస్తామని తెలిపారు.
ఈ పర్యటనలో, గురుబ్రహ్మనగర్ బస్తీ, నందగిరి కాలనీ, హుడా ఎంక్లేవ్ కాలనీలలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులపై కమిషనర్ ఇతర అధికారులతో కలిసి దాదాపు రెండు గంటలపాటు పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ఎంఎల్ఏ దానం నాగేందర్,పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొని వివరాలు అందించారు.