Fri. Jan 3rd, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 8,2024: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైనప్పటికీ కొనుగోళ్ల మద్దతు దక్కలేదు. ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ రంగాల షేర్లు కుదుపునకు గురయ్యాయి.

ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మూడో త్రైమాసికం ఫలితాలే రాబోయే రోజుల్లో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయి.

దిద్దుబాటుకు మరింత ఆస్కారం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆకర్షణీయ ధరల్లో లభించే మంచి స్టాక్స్ కొనుగోలు చేయడం మేలు. నేడు సెన్సెక్స్ 760, నిఫ్టీ 197 పాయింట్ల మేర పతనమయ్యాయి.

ఇన్వెస్టర్లు నేడు రూ.3.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.14వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 72,026 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 72,113 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. వెంటనే 72,181 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. అప్పట్నుంచి పతనం బాట పట్టింది.

చివరి వరకు అలాగే కొనసాగి 71,301 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 670 పాయింట్ల నష్టంతో 71,355 వద్ద ముగిసింది. సోమవారం 21,737 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ 21,763 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

21,492 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి కుంగింది. చివరికి 197 పాయింట్లు పతనమై 21,513 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 708 పాయింట్లు ఎరుపెక్కి 47,450 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 12 కంపెనీలు లాభపడగా 38 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హీరోమోటో కార్ప్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా టాప్ లాసర్స్.

నేడు ఫియర్ ఇండెక్స్‌గా భావించే ఇండియా విక్స్ ఏకంగా 7 శాతం పెరగడం గమనార్హం. రియాల్టీ, మీడియా మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.

బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ రంగాల సూచీలు ఒకటి నుంచి రెండు శాతం వరకు నష్టపోయాయి.

నేడు నిఫ్టీ పతనమవ్వడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (32 పాయింట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (18), ఐటీసీ (17), రిలయన్స్ (15), టీసీఎస్ (13) కీలకంగా నిలిచాయి. నిఫ్టీ జనవరి ఫ్యూచర్ సపోర్టు 21,500 రెసిస్టెన్సీ 21,650 వద్ద ఉన్నాయి.

ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి రెడింగ్టన్ ఇండియా, సీఏఎంఎస్ లిమిటెడ్, సుమిటోమో కెమికల్స్, క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ టార్గెట్ ధరను సిటీ రూ.2,200 నుంచి రూ.2,375 సవరించింది. మహాన్ ఎనర్జెన్ నుంచి పవర్ మెక్ ప్రాజెక్టు రూ.825 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. నైకా మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలను మించుతాయని సిటీ రీసెర్చ్ అంచనా వేసింది.

అంతర్జాతీయ క్లెయింట్ నుంచి సోలార్ ఇండస్ట్రీస్‌కు రూ.994 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. జియో ఫైనాన్స్‌లో 29.6 లక్షలు, హనసా కన్జూమర్‌లో 32.6 లక్షల షేర్లు చేతులు మారాయి.

రూ.450 చొప్పున రూ.700 కోట్ల విలువైన షేర్ల బయ్ బ్యాక్‌ను చంబల్ ఫర్టిలైజర్స్ ఆమోదించింది. బంగాళాఖాతం తీరంలోని ఓ బ్లాక్‌లో చమురు ఉత్పత్తి మొదలు పెట్టడంతో ఓఎన్‌జీసీ షేర్లు 2015 నాటి గరిష్ఠస్థాయికి చేరాయి.

ఎంఎంటీసీ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం పెరిగాయి. కొటక్ మహీంద్రా బ్యాంకులో 10.1 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!