Thu. Jun 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 11 డిసెంబరు 2021:గో పూజ వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ప్రతి గుడిలో ప్రతి రోజు గో పూజ జరిగేలా ఏర్పాట్లు చేయాలని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు.అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షిణ శాల ను శనివారం స్వామి సందర్శించారు. గో పూజ చేసి, సప్త గోవులకు ప్రదక్షిణ చేశారు. గోవులకు దాణా, గ్రాసం, అరటిపండ్లు పెట్టారు. అనంతరం గో తులాబారాన్ని సందర్శించి దాణా ను అందించారు.

ఆ తర్వాత కంచి స్వామి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దేశీయ గోశాల ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ ఇదే బాటలో గో సంరక్షణకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.

టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఇటీవల జాతీయ గో మహాసమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించారని అభినందించారు. సనాతన హిందూ ధర్మం, సంస్కృతి లో గో పూజ కు పెద్ద పీట వేశారన్నారు.

గోవు జంతువు కాదని భక్తుల కోరికలు తీర్చే కామధేనువని స్వామి తెలిపారు. ఎందరో మహా రాజులు, మహర్షులు గో పూజ చేసి తరించారని, రాజ్యం కన్నా గోవే ముఖ్యమనకున్న మహానుభావులు ఎందరో ఉన్నారన్నారు. అలిపిరి వద్ద టీటీడీ నిర్మింపజేసిన సప్త గో ప్రదక్షిణ శాల అందంగా, శాస్త్రీయంగా, ఆకర్షణ గా ఉందన్నారు.