365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 17,2025: విద్యా, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించేందుకు కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ మరో ముందడుగు వేసింది. అమెరికాలోని ప్రముఖ వేన్ స్టేట్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రెండు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా, పరిశోధన సహకారం మరింత బలోపేతం కానుంది.

ఈ సందర్భంగా కెఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు, వేన్ స్టేట్ యూనివర్సిటీ అధికారుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. మెకానికల్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ నబీల్ చల్హౌబ్, సివిల్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ లీలా మోహన్ రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు ఉమ్మడి పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై సమాలోచనలు జరిగాయి.

విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు

ఈ భాగస్వామ్యంతో కెఎల్ విద్యార్థులు వేన్ స్టేట్ యూనివర్సిటీలో చదువు కొనసాగించేందుకు వీలుకలిగేలా అవకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా, వేన్ స్టేట్ విద్యార్థులు కెఎల్ యూనివర్సిటీలో మార్పిడి విద్యార్థులుగా చేరి అనుభవాన్ని పెంచుకునే అవకాశం పొందనున్నారు. వచ్చే సెమిస్టర్ నుంచే ఈ ఒప్పందాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ ప్రమాణాలతో కెఎల్ విద్య

ఈ ఒప్పందంపై కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంతర్జాతీయ సంబంధాల డీన్ డాక్టర్ ఎం. కిషోర్ బాబు మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం మా విద్యార్థులు, అధ్యాపకులకు విశ్వ స్థాయి పరిశోధనల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది. వేన్ స్టేట్ నైపుణ్యం నుంచి నేర్చుకోవడంతో పాటు ఉమ్మడి పరిశోధనల ద్వారా బలమైన విద్యా సంబంధాలు నెలకొననున్నాయి” అని తెలిపారు.

ఈ సందర్భంగా వేన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు అమెరికాలో ఉన్నత విద్య, కొత్త విద్యా ధోరణులు, అక్కడ కెరీర్ అవకాశాలపై కెఎల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు.

ప్రపంచవ్యాప్తంగా కెఎల్ విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలు

కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇప్పటికే మలేషియాలోని యూనివర్సిటీ మలయా, యూఎస్‌లోని మిస్సోరి విశ్వవిద్యాలయం, కాన్సాస్ సిటీ, థాయిలాండ్‌లోని కింగ్ మోంగ్కుట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెస్ట్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం, మలేషియాలోని తుమ్కు అబ్దుల్ రెహమాన్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది.

ఈ అంతర్జాతీయ సహకార ఒప్పందాల ద్వారా పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అధ్యాపకుల సహకారం వంటి కార్యక్రమాలను విస్తరించి విద్యా రంగంలో కెఎల్ తన జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును మరింత బలపర్చుకుంటోంది.