Sat. May 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మే 4,2024:ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (L&TMRHL) 50 కోట్ల ప్యాసింజర్ ప్రయాణాల మైలురాయిని సాధించింది.

ఈ సందర్భంగా మెట్రోలో తరచుగా ప్రయాణించే వారి కోసం L&TMRHL గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో ఇటువంటి ప్రోగ్రాం ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం.

“ఈ కీలకమైన మైలురాయిని సాధించడమనేది మాకెంతో సంతోషకరమైన అంశం. ప్రయాణించేందుకు సురక్షితమైన, విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన మాధ్యమంగా హైదరాబాద్ మెట్రోపై పెరుగుతున్న నమ్మకానికి, లభిస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం.

ప్రయాణికులకు మెరుగైన అనుభూతులను, తరచుగా ప్రయాణించే వారికి ప్రోత్సాహకాలను అందించలన్న మా నిబద్ధతకు లాయల్టీ ప్రోగ్రాం నిదర్శనంగా నిలుస్తుంది” అని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ శ్రీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

“ది గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ అనేది మమ్మల్ని ఆదరిస్తున్న ప్రయాణికులను గుర్తించేందుకు, వారికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రోగ్రాం.

ప్రయాణించే వారికి ప్రోత్సాహకంగా ఉండటంతో పాటు నగరంలో పర్యావరణ అనుకూలమైన విధంగా ప్రయాణించే అలవాటును పెంపొందించేందుకు కూడా ఈ వినూత్నమైన ప్రోగ్రాం తోడ్పడగలదు.

గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ విజయవంతం కాగలదని విశ్వసిస్తున్నాను” అని ఎల్అండ్‌టీఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ & సీఈవో శ్రీ కేవీబీ రెడ్డి తెలిపారు.

గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్: ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు వాగ్దానం

హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు వినూత్నమైన అనుభూతులను అందించే విధంగా రూపొందించిన కస్టమర్ లాయల్టీ పథకమే ది గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్.

దీని ప్రధాన లక్ష్యాలు:

. తరచుగా ప్రయాణించే వారికి ప్రోత్సాహకాలు అందించడం: ఒక క్యాలెండర్ నెలలో ప్రయాణించిన ట్రిప్పులను బట్టి స్మార్ట్‌కార్డులను ఉపయోగించే ప్రయణికులకు పాయింట్లు లభిస్తాయి. వీటిని ఉచిత ట్రిప్పులు, మర్చండైజ్, లక్కీ డ్రా గిఫ్టులు మొదలైన వాటి కోసం ఉపయోగించుకోవచ్చు.

. ఒక కమ్యూనిటీ భావనను పెంపొందించడం: ప్రయాణికుల్లో మరింత సానుకూల, కనెక్టెడ్ ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు, మెట్రో తమదేనన్న భావనను పెంపొందించేందుకు ఇది తోడ్పడగలదు.

. పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రమోట్ చేయడం: మెట్రోను వినియోగించుకున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా మరింత పర్యావరణ అనుకూల ప్రయాణ మాధ్యమం వైపు మళ్లేలా ప్రోత్సహించేందుకు, ట్రాఫిక్ రద్దీ,కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడగలదు.

కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం ఎలా పని చేస్తుందంటే

· అర్హత: ప్రయాణాలకు స్మార్ట్ కార్డులను ఉపయోగించే ప్యాసింజర్లు అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. క్యాలెండర్ నెలవారీగా ట్రిప్‌లు లెక్కించబడతాయి. నిర్దిష్ట ప్రోత్సాహకాల అంచెలను అందుకోవడానికి ప్రయాణికులు వరుసగా మూడు నెలల పాటు నిర్దిష్ట సంఖ్యలో ట్రిప్‌లను నమోదు చేసి ఉండాలి.

· లాయల్టీ అంచెలు: సిల్వర్, గోల్డ్, ప్లాటినం అని ఈ ప్రోగ్రాం మూడు అంచెలుగా ఉంటుంది. ప్రతి అంచెకు నిర్దిష్ట సంఖ్యలో ట్రిప్‌లు అవసరమవుతాయి. దశను బట్టి ఉచిత ట్రిప్‌లు, ఎక్స్‌క్లూజివ్ మర్చండైజ్, ఆకర్షణీయమైన బహుమతులు అందించే లక్కీ డ్రా పోటీల్లో పాల్గొనేందుకు అవకాశాలు వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి.